
ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు
హనుమాన్‌జంక్షన్‌రూరల్: ప్రకృతి వ్యవసాయ విధానంతో అధిక లాభాలు పొందవచ్చని, రైతులందరూ ఆ దిశగా ఆలోచన చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. బాపులపాడు మండలంలోని ఆరుగొలను, కానుమోలు, రేమల్లే గ్రామాల్లో బుధవారం పర్యటించిన కలెక్టర్ బాలాజీ ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటలను పరిశీలించారు. ఆరుగొలను, కానుమోలులో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంట పొలాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆరుగొలనులో ఎకరం పొలం కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ విధానాలతో వరి సాగు చేస్తున్న రైతు చలం ప్రసాద్‌తో కలెక్టర్ ముచ్చటించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులు..
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించటం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుందని, ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పతులు సమాజానికి అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం రేమల్లేలో బెజవాడ ఏడుకొండలు అనే రైతు 14 ఎకరాల్లో సాగు చేస్తున్న కోకో పంటను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. కోకో పంట సాగుకు అయ్యే ఖర్చు, సాగులో తలెత్తే సమస్యలు, దిగుబడి వంటి విషయాలను రైతును అడిగి తెలుసుకున్నారు. మొక్క నాటిన మూడో ఏడాది నుంచి పంట దిగుబడి వస్తుందని, సాధారణ చాక్లెట్లతో పాటుగా యాంటీ డయాబెటిక్ చాక్లెట్ల తయారీ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు రైతు వివరించారు. జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, గుడివాడ ఆర్డీవో జి.బాల సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ మురళీకష్ణ, ఎంపీడీవో జోగేశ్వరరావు పాల్గొన్నారు.