కార్పొరేట్లే ‘షైనింగ్ స్టార్స్’!
ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు ప్రభుత్వ సత్కారాలు
ఎన్టీఆర్ జిల్లాలో షైనింగ్ స్టార్స్ ఇలా..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్స్ పేరుతో పది, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అందించిన పురస్కారాలు దానిని రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అడుగడుగునా ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి అండగా నిలిచింది. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేదిగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 174 మందికి సత్కారాలు..
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో షైనింగ్ స్టార్స్ పేరుతో పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మండలాల్లో కులాల ప్రతిపాదికన విద్యార్థులను ఎంపిక చేసింది. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు పురస్కారాన్ని సైతం అందించాలని నిర్ణయించింది. పదో తరగతికి సంబంధించి 131 మందికి, ఇంట ర్మీడియెట్ కోర్సులకు చెందిన 43 మందికి ఈ అవార్డుల కోసం ఎంపిక చేసి ప్రదానం చేశారు.
సర్వత్రా విమర్శలు..
ప్రభుత్వం తానిచ్చే పురస్కారాలు, అవార్డులు తొలుత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇవ్వటం పరిపాటి. పేద, మధ్య తరగతి అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించటం ద్వారా మరింత మంది ఆ విధమైన స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారు. మరిన్ని విజయాలను సాధించేందుకు అది ఆదర్శంగా నిలుస్తుంది. కానీ జిల్లాలో సోమవారం అందించిన అవార్డులు దాదాపుగా 90 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకే అందించింది. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించినా ప్రైవేట్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వటం ఏమిటని విద్యారంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.
ఆ ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి..
ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలకు చెందిన విద్యార్థులను విద్యాశాఖ కులాల ప్రతిపాదికన ఎంపిక చేసింది. అందులో భాగంగా కేవలం ఎనిమిది మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అందులో ఎంపిక చేయటం వివాదాస్పదమవుతోంది. 12 మండలాలకు చెందిన ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ విద్యార్థికి ఈ పురస్కారాల్లో అవకాశం లభించలేదు. మిగిలిన ఎనిమిది మండలాలకు సంబంధించి నాలుగు మండలాలకు ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన మండలాలకు చెందిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించినా, ఆ మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులను దూరం పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో 131 మందిని పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయగా అందులో 19 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 112మంది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు చెందిన విద్యార్థులే. అలాగే ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 43 మందిని ఎంపిక చేయగా అందులో కేవలం పది మంది మాత్రమే ఎయిడెడ్, ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 33 మంది పూర్తిగా కార్పొరేట్ విద్యార్థులే.
విజయవాడ నుంచి ఒక్కరూ లేరు..
ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ ఉత్తరం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ మండలాలు చాలా ప్రధానమైనవి. విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో నగరపాలకసంస్థ, ఎయిడెడ్ విద్యాసంస్థలు వంద వరకూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఈ విద్యా సంస్థల నుంచి ఒక్క విద్యార్థిని కూడా విద్యాశాఖ ఎంపిక చేయలేదు. ఎయిడెడ్, నగరపాలకసంస్థ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన పదో తరగతి విద్యార్థులు అవార్డులు సాధించిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కు లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికీ విద్యాశాఖ అమలు చేసిన నిర్ణయం తీవ్రమైన అన్యాయం చేసిందంటూ ఉపాధ్యాయులు సైతం విమర్శిస్తున్నారు.
కార్పొరేట్లే ‘షైనింగ్ స్టార్స్’!


