
ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం మధ్యాహ్నం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి పాండురంగారెడ్డితో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో పక్కా నిఘా ఉంచి తనిఖీలు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై మాత్రమే కాకుండా అడిగిన వారు, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. న్యాయమూర్తి పాండురంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా జనాభాలో సీ్త్ర, పురుష లింగ నిష్పత్తుల గణాంకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నిష్పత్తుల్లో వ్యత్యాసం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లాలో రిజిస్ట్రేషన్ కలిగిన స్కానింగ్ కేంద్రాలు మొత్తం 89 ఉండగా వాటిలో 15 ప్రభుత్వ, 72 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కోసం ఐదు దరఖాస్తులు, రెన్యువల్ కోసం మూడు, క్యాన్సిలేషన్‌కు ఒక దరఖాస్తు వచ్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో ఎస్ శర్మిష్ట వివరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు ధర్మతేజ, పి. వెంకటేశ్వరరావు, విద్య మాస్ మీడియా అధికారి సీహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు.