
అన్నమయ్య పదశోభకు పట్టంకట్టిన సంకీర్తనలు
విజయవాడకల్చరల్: శ్రీ వెంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస), కంచికామకోటిపీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 617వ జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పదయజ్ఞం కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో ముడుంబై లక్ష్మి, రుగ్వేదం సోదరీమణులు, వడ్డాది కామేశ్వరి, వీరుభొట్ల సీతారమణి, తిరుపతికి చెందిన చిన్నమదేవి, ఎన్‌సీ శ్రీదేవిలు సంగీత యజ్ఞంలో పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు విశేష ప్రాధాన్యం కలిగించిన గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ స్మృత్యర్ధం ఆయన ఆలపించిన కీర్తనల వీడియోలను, ఆయన అందుకున్న పురస్కారాలను ప్రదర్శించారు.
అలరించిన సప్తగిరుల సంకీర్తనం..
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని చేరుకోవాలంటే ఏడుకొండలను దాటి రావాలి ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని ప్రాధాన్యతను వివరిస్తూ అన్నమయ్య రచించిన కీర్తనలకు సప్తగిరులని పేరు అవి భావములోన, బ్రహ్మకడిగిన పాదము, యెంతమాత్రమున, పొడగంటిమయ్యా, కొండలలోనెలకొన్న, నారాయణతే నమోనమో, ముద్గుగారే యశోద కీర్తనలను నగరానికి చెందిన పలువురు విద్వాంసులు మధురంగా ఆలపించారు. నిర్వాహకులు స్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. లబ్బీపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మాగంటి వేణుగోపాల్, కార్యనిర్వాహకుడు డాక్టర్ సి.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు.
కారు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కారు ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కొండపల్లి శాంతినగర్ సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి గ్రామానికి చెందిన కంపా సాంబయ్య(59) ఆటోడ్రైవర్‌గా పని చేస్తాడు. ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కంపా సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది చేరుకుని వైద్యపరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఇద్దరికి వివాహాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అన్నమయ్య పదశోభకు పట్టంకట్టిన సంకీర్తనలు