
గురుకుల విద్యార్థుల ప్రతిభకు పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను సత్కరించారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంజేపీ గురుకులాలు, బీసీ గృహాల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకుల పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, 22 మందికి రూ.20 వేలు, రూ.15, రూ.10 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకుల పాఠశాలల బీసీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించటం అభినందనీయమన్నారు. జూన్ 15వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని హాస్టళ్లల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సంచాలకుడు డాక్టర్ ఎ.మల్లికార్జున్, అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్‌రాజు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, ఎ.కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.