
రసాయన రహిత మామిడి పండ్లకు మైలవరం మార్కెట్ పెట్టింది పేరు కొనుగోలుదారులకు నేరుగా రైతులే విక్రయాలు సాగిస్తున్న వైనం తెగుళ్లు ఆశించి దిగుబడులు పడిపోయి కళతప్పిన రైతు మార్కెట్
జి.కొండూరు: మైలవరం మామిడి పండ్ల మార్కెట్ రైతు మార్కెట్‌గా పేరుగాంచింది. సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్లను రైతులు నేరుగా ఈ మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతుంటారు. వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు సైతం ఈ మార్కెట్‌లోనే పండ్లను కొనుగోలు చేస్తుంటారు. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మామిడి పండ్ల మార్కెట్‌కి ఇప్పుడు కష్టమొచ్చింది. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లు ఆశించి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గిపోయి మార్కెట్ కళ తప్పింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక రోడ్ల పక్కనే రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి ప్రత్యేక స్థలం కేటాయించి మార్కెట్‌కు ఊతమిస్తే జిల్లాలోనే అతి పెద్ద మామిడి పండ్ల మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉందని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
తోటల నుంచి నేరుగా మార్కెట్‌కు..
మైలవరం మామిడి పండ్ల మార్కెట్‌కు మైలవరం, జి.కొండూరు, విజయవాడరూరల్, రెడ్డిగూడెం, ఎ.కొండూరు మండలాల పరిధిలోని మామిడి తోటల నుంచి రైతులు నేరుగా పండ్లు తీసుకొస్తారు. బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు వంటి పండ్లను ఎక్కువగా విక్రయిస్తారు. రైతులతో పాటు ఈ మార్కెట్‌లో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు మామిడి తోటలను లీజుకొని పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ మార్కెట్‌లో స్థిరంగా వ్యాపారం చేసే వ్యాపారులు 50 మంది వరకు ఉండగా రైతులు చుట్టు పక్కల మండలాల నుంచి 200 మంది వరకు వచ్చి మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి ప్రారంభంలో వచ్చే కాయలను ప్రయివేటు మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
కాయ ముదిరి పంటకు వచ్చిన తర్వాతనే ఈ మార్కెట్ ప్రారంభమవుతుంది. మైలవరం మామిడి పండ్ల మార్కెట్ ఏప్రిల్ రెండో వారం తరువాత ప్రారంభమై జూన్ రెండో వారం ముగిసే వరకు కొనసాగుతుంది. రైతులు, తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులు నేరుగా విక్రయాలు జరపడం వల్ల నాణ్యమైన, సహజ సిద్ధంగా పండిన పండ్లు వినియోదారుడికి తక్కువ ధరకే లభిస్తాయి. గత ఏడాది వరకు ఈ మార్కెట్‌లో రోజుకు 15 టన్నుల వరకు పండ్ల విక్రయాలు జరిగాయి.
ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో వ్యాపారం సగానికి పడిపోయింది. ఈ మార్కెట్‌లో వ్యాపారం మూడు అంచలుగా జరుగుతుంది. రైతులతో పాటు కొంత మంది వ్యాపారులు కూడా పండ్లు విక్రయిస్తారు. హోల్‌సేల్ ధరలకే వినియోగదారుడికి మామిడి పండ్లు లభిస్తాయి. మైలవరం పశువుల ఆస్పత్రి ఎదురుగా విజయవాడ, భద్రాచలం జాతీయ రహ దారికి ఇరువైపులా మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద రసాలు డజను రూ.150 నుంచి సైజును బట్టి విక్రయిస్తున్నారు. బంగినపల్లి డజను రూ.240 చొప్పున విక్రయిస్తున్నారు.
ఈ ఫొటోలోని మహిళ పేరు సందిపాము వెంకట రత్నమ్మ. ఇరవై ఏళ్లుగా మైలవరం మామిడి పండ్ల మార్కెట్‌లో వ్యా పారం చేస్తోంది. ఈ ఏడాది 12 ఎకరాల తోట లీజుకు తీసుకొని రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టింది. పురుగులు, తెగుళ్లు, పెనుగాలులతో కూడిన అకాల వర్షం వల్లన తీవ్రంగా నష్టపోయింది. లాభం సంగతి అటుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టపోయింది. అయినప్పటికీ పండ్లను సరసమైన ధరకే విక్రయిస్తోంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఈ వ్యాపారానికే అలవాటు పడిపోయానని పేర్కొంటోంది. ప్రభుత్వం పరిహారం అందిస్తే కొంతమేర నష్టాలు తగ్గుతాయని ఆశిస్తోంది.

మైలవరం మామిడి పండ్ల మార్కెట్

సందిపాము వెంకట రత్నమ్మ