
నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలపూడి(మచిలీపట్నం): నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌ఎస్‌ఎన్‌ఎంవీఆర్‌వీ ప్రసాద్, సహాధ్యక్షుడిగా ఎం. ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా డి. కుమార్, ఎ. కోదండరామ్, కార్యదర్శిగా ఎస్. రాము, సంయుక్త కార్యదర్శులుగా నాగలక్ష్మి, గోపీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్‌కే జాబార్, కోశాధికారిగా ఎం. నాగలక్ష్మీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్. శ్రీనివాస్, కె. కొండయ్య తెలిపారు.
గుడివాడలో జాబ్‌మేళా
చిలకలపూడి(మచిలీపట్నం)/గుడివాడ రూరల్: గుడివాడలోని ఏఎన్‌ఆర్ కళాశాలలో ఈ నెల 14వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదివారం తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనాశాఖ ఆధ్వ ర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామన్నారు. హెటీరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, పతంజలి ఫుడ్స్ తదితర కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు పదో తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసి ఉన్న వారు పాల్గొనవచ్చని, వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనంతో పాటు సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించాలన్నారు.
ద్వారకాతిరుమల
వెంకన్నకు పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు.
నేడు కలెక్టరేట్‌లో మాక్‌డ్రిల్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీలల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగల్లో ఎవరైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడతెరపి లేకుండా కురిసే భారీ వర్షాల సమయాల్లో భవనాలు కూలితే ఏమిచేయాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా కార్యక్రమాన్ని తిలకించి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు.
పవర్ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు
మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని వివరాలు చెబుతూ.. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక