అంతా మా ఇష్టం.. | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం..

May 10 2025 2:20 PM | Updated on May 10 2025 2:20 PM

అంతా మా ఇష్టం..

అంతా మా ఇష్టం..

● దర్జాగా అసైన్డ్‌ భూముల కబ్జా ● వందలాది ఎకరాల్లో సముద్రాన్ని తలపించేలా తవ్వకాలు ● పదుల సంఖ్యలో ప్రొక్లయిన్‌లు, వందలుగా ట్రాక్టర్లు ● కన్నెత్తయినా చూడని అధికార యంత్రాంగం

కృత్తివెన్ను: ఒకటికాదు రెండుకాదు దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా చెరువు తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పొరుగు జిల్లాకు చెందిన కొందరు బడా బాబులకు స్థానికంగా ఉన్న ‘తమ్ముళ్లు’ తోడవడంతో నిరాటంకంగా తవ్వకాలు సాగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో ఇంత భారీ ఎత్తున అక్రమ చెరువు తవ్వకాలు జరుగుతున్నా.. స్థానిక రెవెన్యూ యంత్రాంగం అటువైపు కన్నెత్తయినా చూడకపోవడం గమనార్హం.

చెరిగిన సరిహద్దులు..

చెరువు తవ్వకాలలో అక్రమార్కులు రెవెన్యూ గ్రామాల సరిహద్దులు సైతం చెరిపేశారని అధికారులే తలల పట్టుకుంటున్నారు. వారి ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో ఏ గ్రామం హద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నట్లు వాపోతున్నారు. వందలాది ఎకరాల అసైన్డ్‌ భూముల్లో జరుగుతున్న తవ్వకాలపై ప్రశ్నించే సాహసం ఎవరూ చేయకపోవడంతో మండలంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పెదలంక డ్రెయినే సరిహద్దుగా..

కొల్లేరు ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు ప్రధాన మార్గంగా ఉన్నటువంటి పెదలంక డ్రెయిన్‌ను సరిహద్దుగా చేసుకుని భారీ చెరువుల కట్టలు వేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో అధికవర్షాల వల్ల వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు కష్టమవుతుంది. కృత్తివెన్నుతో పాటు కలిదిండి, బంటుమిల్లి, ముదినేపల్లి, గుడ్లవల్లేరు మండలాలలోని పంటపొలాలు, చెరువులకు ప్రమాదం పొంచి ఉంది.

సరికొత్తగా బ్లాక్‌ మెయిలింగ్‌..

ఇదిలా ఉంటే తవ్వకాలపై అధికారులు ప్రశ్నిస్తుంటే లీజుదారులు, ‘తమ్ముళ్లు’ కలసి అధికారులనే బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. రైతులతో ‘మీ ఆర్థిక కష్టాలు తీర్చాలని మేం వచ్చామే గాని ఇందులో మాకు ఎటువంటి లాభం లేదు చెరువు తవ్వకాలు అడ్డుకుంటే మేం వదిలేసి వెళ్లిపోతాం’ అని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉంటున్న కొందరు నాయకులు అధికారుల వద్దకు వచ్చి చూసీ చూడనట్లు ఉండాలని చెబుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పేదవర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వారే చేసుకోవాలి. లేదా సొసైటీగా ఏర్పడి ఉమ్మడి సాగు చేయాలి. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల వర్షం కురుస్తుండటంతో పనులకు రెండు రోజులు తాత్కాలికంగా బ్రేక్‌ పడినా తరువాత దీనిపై సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా లేక చూసీచూడనట్లు వదిలేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

కృత్తివెన్ను మండలంలోని నిడమర్రు పంచాయతీలో వేలాది ఎకరాలు అసైన్డ్‌ భూముల్లో నిరాటంకంగా చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. అవ న్నీ ప్రభుత్వ భూములే అని అధికారులు చెబుతున్నప్పటికీ.. కనీసం అటువైపు చూడకపోవడంతో తవ్వకాలకు అడ్డేలేకుండా పోయింది. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలోనే బావుంది.. ఎక్కడ పనులు జరుగుతున్నాయో తెలిసేది.. కానీ ఇప్పుడు ఎవరిష్టం వారిది.. ప్రభుత్వ భూములు అని తెలిసినా తవ్వేస్తున్నారు. ఏంటని ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నాం ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు.. అంతా మా ఇష్టం.. అంటూ మాట్లాడుతున్నారు’ అని వాపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement