
నేరస్తులకు కచ్చితంగా శిక్షలు పడాలి
వర్క్‌షాప్‌లో కృష్ణా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోలీసుల దర్యాప్తు ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధరరావు సూచించారు. దర్యాప్తులో నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సంపూర్ణంగా సేకరిస్తేనే అది సాధ్యపడుతుందని ఆ దిశగా అధికారులు, సిబ్బంది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తు చేసే అధికారులకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ సేకరించడం, సంరక్షించడం, టెస్టింగ్‌కు పంపే సమయం, ప్యాకింగ్‌లో పాటించవలసిన అంశాలపై ప్రత్యేక నిపుణులతో ఒకరోజు వర్క్ షాప్‌ను నిర్వహించారు. జిల్లా పోలీసు సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పోలీస్ అధికారికి ఏదో ఒక రూపంలో సవాలు ఎదురవుతూనే ఉంటుందన్నారు. నేరానికి దారి తీసిన అంశాలను తెలుసుకునేందుకు ప్రతి పోలీసు అధికారి సంపూర్ణ నిష్ణాతుడై ఉండాలన్నారు. ఈ సదస్సులో నేర్చుకున్న ప్రతి అంశం దర్యాప్తు వేగవంతంగా పూర్తి కావటానికి, నేరస్తులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయడానికి, సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ వి.వి నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. శ్రీలత, అసిస్టెంట్ డైరెక్టర్‌లు ఎస్.వీర కుమారి, జె. సత్యరాజు, సైంటిఫిక్ ఆఫీసర్ కె. సురేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డి.హుమేరా జుబేదా ఖానం తదితరులు పాల్గొన్నారు.