
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 ఓపెన్, బాలికల రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 3, 4 తేదీల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల పోస్టర్‌ను స్కూల్ ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఏడు రౌండ్ల పోటీలు జరుగుతాయన్నారు. పోటీల అనంతరం జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తామని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నీ తమ స్కూల్‌లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ టోర్నీకి స్కూల్ తరఫున పూర్త సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టోర్నీ డైరెక్టర్ రేణుక, స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు శివ పాల్గొన్నారు.