కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ | - | Sakshi
Sakshi News home page

కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ

Mar 19 2025 2:05 AM | Updated on Mar 19 2025 2:05 AM

కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ

కష్టజీవిని కావ్య నాయకుడిని చేసిన శ్రీశ్రీ

గుణదల(విజయవాడతూర్పు): తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ మార్గదర్శి అని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాల ప్రాచ్య భాషల విభాగం ఆధ్వర్యంలో శ్రీశ్రీ సాహిత్యంపై మంగళవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆశాజ్యోతి ఆన్‌లైన్‌ ద్వారా ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన మహా ప్రస్థానం అమృతోత్సవం సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీశ్రీ సాహిత్యంలోని ప్రగతిశీల భావాలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. కష్టజీవిని కావ్య నాయకుడిగా చేసిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన లయోల కళాశాల ప్రిన్సిపాల్‌ రెవరెండ్‌ ఫాదర్‌ డాక్టర్‌ జి.ఎ.పి.కిశోర్‌ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీశ్రీ అని కొనియాడారు. కళాశాల రెక్టార్‌ రెవ రెండ్‌ ఫాదర్‌ డాక్టర్‌ జాన్‌బాబు మాట్లాడుతూ శ్రీశ్రీ ఎంతో మంది కవులను ప్రభావితం చేశారని చెప్పారు. వాషింగ్‌టన్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మాధురి ఇంగువ విశిష్ట అతిథిగా పాల్గొని శ్రీశ్రీ కవితా తత్త్వాన్ని విశ్లేషించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్‌ ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రామికవర్గ సౌభాగ్యాన్ని, కార్మిక లోక కల్యాణాన్ని శ్రీశ్రీ తన కవిత్వంలో అద్భుతంగా చిత్రించారని పేర్కొన్నారు. మరో అతిథి శ్రీశ్రీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బాల్యం నుంచి శ్రీశ్రీ కవిత్వం ద్వారా ప్రేరణ పొందానని అన్నారు. కీలకోపన్యాసం చేసిన గరికపాటి రమేష్‌బాబు మాట్లాడుతూ.. శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి దారి, దీపమై నిలిచిందని, విప్లవోద్యమానికి ప్రేరణ ఇచ్చిందని వివరించారు. ప్రాచ్య భాషల విభాగం అధ్యక్షుడు, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ కోలా శేఖర్‌ ఈ సదస్సు లక్ష్యాలను వివరించారు. తెలుగు అధ్యాపకులు అమృతరావు సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్కృత అధ్యాపకుడు వెంకటేశ్వరావు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పరిశోధకుల పత్రాలతో కూడిన వ్యాససంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, డాక్టర్‌ విజయానందరాజు, దివి కుమార్‌, అనిల్‌ డానీ, వెన్నా వల్లభరావు, కళాశాల అధ్యాపకులు కృపారావు, స్నేహల్‌ విమల్‌ శుక్ల తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పుస్త కాన్ని పాకెట్‌ సైజ్‌లో ముద్రించి విశ్వేశ్వరరావు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బహూకరించారు. శ్రీశ్రీ సాహిత్య నిధి కన్వీనర్‌ సింగంపల్లి అశోక్‌ కుమార్‌ వంద శ్రీశ్రీ బుల్లెట్‌ పుస్తకాలను విద్యార్థులకు, పరిశోధకులకు బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement