
స్వామివారి లడ్డూను పాడుకున్న శ్రీనివాసరావు
భవానీపురం(విజయవాడ పశ్చిమ): వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన వేలం పాటల్లో ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన ఈ వేలం పాటల్లో స్వామివారి లడ్డూను కె.శ్రీనివాసరావు రూ.33 వేలకు పాడుకున్నారు. వినాయకుని విగ్రహానికి వేసిన రూ.100 కరెన్సీ నోట్ల దండను వేలం వేయగా మొవ్వ భూషయ్య రూ.27,500 వేలకు పాడుకున్నారు. రూ.50 నోట్ల దండను కె.నారాయణమ్మ రూ.15,500కు, స్వామివారి దగ్గర పెట్టిన డిబ్బీని పి.నాగు రూ.4 వేలకు పాడుకున్నారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ విజయవాడ డివిజన్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్, బరంపార్క్ యూనిట్ మేనేజర్ సత్యారావు, సాగర్ యూనిట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు కుమారస్వామి, గంగరాజు, నాగు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.