
భక్తులతో నిండిన పుణ్యక్షేత్రం
గుణదల (విజయవాడ తూర్పు): ప్రతి ఒక్కరూ చెడును విసర్జించి సన్మార్గంలో నడుచుకుంటూ దేవుని ప్రేమలో జీవించాలని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజ్ అన్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో ఆదివారం సమష్టి దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని యెడల విశ్వాసం కలిగి ఆయన యందు భయ భక్తులు కలిగి జీవించాలని సూచించారు. లోక సంబంధమైన దురాశ, మోసం, కక్షలకు దూరంగా ఉంటూ భక్తి పూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. సర్వమానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు శిలువ పై బలయ్యాడని, ఆయన త్యాగాన్ని ఎల్లపుడూ మననం చేసుకోవాలన్నారు. ఆయన ఆచరించి చూపిన ప్రేమ, జాలి, కరుణ వంటి లక్షణాలను అలవర్చుకోవాలని వివరించారు. యేసుక్రీస్తును ఈ లోకానికి అందించిన మరియమాతను ఆశ్రయిస్తే సకల ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం శెలవు దినం కావడంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొండ శిఖరాగ్రం వరకు కాలిబాటన నడచివెళ్లి యేసుక్రీస్తు శిలువ వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.