వలస బాలల భవితకు భరోసా

ముచ్చింతాల సీజనల్‌ హాస్టల్‌లో స్నాక్స్‌ తింటున్న విద్యార్థులు - Sakshi

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం సీజనల్‌ హాస్టళ్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న వెనుక బడిన ప్రాంతాల్లో ఎన్జీఓ సహకారంతో సమగ్ర శిక్ష ఆర్థిక తోడ్పాటుతో వీటిని నడుపుతోంది. ఈ సీజనల్‌ హాస్టళ్లు డ్రాపౌట్‌, వలస విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్కో హాస్టల్‌లో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విస్సన్నపేట, వీరులపాడు, విజయవాడ రూరల్‌ మండలాల్లో మొత్తం 46 సీజనల్‌ హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఈ హాస్టళ్లలో మొత్తం 2,103 మంది చదువుకుంటున్నారు.

హాస్టళ్ల నిర్వహణ ఇలా...

సీజనల్‌ హాస్టళ్లను ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్జీఓ సంస్థలు తీసుకున్నాయి. పాఠశాలలకు అనుబంధంగా నిర్వహించే వీటిలో పిల్లలకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో అందిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్ర త్యేక టీచర్లతో బోధన చేయిస్తారు. పాఠశాలల సమ యం ఆధారంగా వసతి గృహాలు నడుస్తాయి. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును ముందుగా ఎన్జీఓ సంస్థ భరిస్తుంది. ఆ తరువాత సమగ్ర శిక్ష తిరిగి చెల్లిస్తుంది.

పేద విద్యార్థులకు ఉపయుక్తం

వ్యవసాయ, ఇతర పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చే వారి పిల్లలకు ఈ హాస్టళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం, సాయంత్రం పిల్లలకు చదువు చెప్పడంతోపాటు భోజన వసతి కూడా ఉంటున్నందున వలస వచ్చిన కూలీలు తమ పిల్లలను సీజనల్‌ హాస్టళ్లకు పంపుతున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా కొందరు పిల్లలు అర్ధాంతరంగా బడి మానేసి పనులకు వెళ్తుంటారు. ఇలాంటి వారు హాస్టళ్లకు ఉదయం, సాయంత్రం వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసి ఉదయం, రాత్రి హాస్టల్‌కు రావటం వల్ల అదనపు బోధనతో పాటు రెండు పూటలా భోజన వసతి లభిస్తుంది.

సీజనల్‌ హాస్టళ్లలో విద్యార్థులకు సకల సదుపాయాలు డ్రాపౌట్స్‌ నివారణే లక్ష్యంగా ఏర్పాటు ఎన్టీఆర్‌ జిల్లాలో 46 వసతి గృహాలు సమగ్ర శిక్ష ఆర్థిక తోడ్పాటు నిర్వహణ

ఉత్తమ విద్యాబోధన

పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సీజనల్‌ హాస్టళ్లు నిర్వహిస్తున్నాం. వలస పిల్లలు, డ్రాపౌట్స్‌ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈసీజనల్‌ హాస్టల్‌లో చేరుస్తున్నాం.

– బసవపూర్ణయ్య, ఎన్‌జీఓ బాధ్యుడు

పేదలకు ఉపయుక్తం

సీజనల్‌ హాస్టళ్లు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 46 సీజనల్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఇవి డ్రాపౌట్స్‌, వలసదారుల పిల్లలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం ఉత్తమ విద్యాబోధన అందుతుంది.

– జి.ఉమామహేశ్వరరావు, సమగ్ర శిక్ష

అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top