
కోనేరుసెంటర్: స్వల్ప మనస్పర్థలతో బంధాలు తెంచుకునేందుకు సిద్ధపడే భార్యభర్తలను సున్నితమైన చర్యలతో వారి సమస్యలు పరిష్కరించి కలిపేందుకు ప్రయత్నించాలని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువ కౌన్సెలింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. కౌన్సెలింగ్‌తో బంధాన్ని బలపరచాలే తప్ప తుంచే విధంగా ఉండకూడదన్నారు. దిశ పోలీస్‌స్టేషన్‌లో 12 కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు దూరం కాకుండా వారి బాంధవ్యం బలంగా ఉండేలా చేసేందుకు పోలీసుశాఖ తరఫున ఫ్యామిలీ కౌన్సెలింగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎస్పీ దిశ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్‌వీరామాంజనేయులు, డీఎస్పీలు మాసూంబాషా, గోపు రాజీవ్‌కుమార్, సత్యానందం జయపాల్, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
కుటుంబ తగాదాలతో
వ్యక్తి హత్య
పెనమలూరు: కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేసిన ఘటన పెనమలూరులో చోటుచేసుకుంది. సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం... టైమ్ ఆస్పత్రి సమీపంలో సాలిగ్రామ్ సురేష్ (50), ఆయన భార్య అరుణ, కుమారులు వినీత్, ఆకాష్‌బాబులు ఉంటున్నారు. పెద్ద కుమారుడు వినీత్ గత ఐదు సంవత్సరాల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. చాలా కాలం తరువాత ఐదు రోజుల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారిని పెద్ద కుమారుడు వినీత్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చాడు. వినీత్ ట్రాన్స్‌జెండర్‌గా మారటానికి భార్యే కారణమని గురువారం రాత్రి భర్త సురేష్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఈ గొడవలో చిన్న కుమారుడు ఆకాష్‌బాబు, భార్య అరుణ కలిసి సురేష్‌పై విచక్షణా రహితంగా దాడి చేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన పై మృతుడి సోదరుడు సాలిగ్రామ్ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య అరుణ, కుమారుడు ఆకాష్‌బాబుపై హత్య కేసు నమోదు చేశారు.
పిడుగుపాటుకు
మహిళా కూలీ మృతి
కంభంపాడు(వత్సవాయి) : పిడుగుపాటకు మహిళా కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామంలో మిర్చి కోసేందుకు తెలంగాణ నుంచి కూలీలు వచ్చారు. రోజు మాదిరిగానే పొలానికి వెళ్లి మిర్చి కోస్తున్న సమయంలో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో కూలీలు తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా ఉరుముతోపాటు పిడుగుపడటంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నవరం గ్రామానికి చెందిన సైదమ్మ (40) మృతి చెందగా మరొక మహిళ స్వల్పంగా గాయపడింది.

మృతి చెందిన సాలిగ్రామ్ సురేష్