
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం జాతీయ సేవా విభాగం సమన్వయకర్త డాక్టర్ కట్టిమణి వివేకానందకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. నాగపూర్‌లో జరిగిన ఫోర్త్ ఎడిషన్ రీసెర్చ్ అవార్డులో డాక్టర్ వివేకానంద దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి పద్మశ్రీ ప్రొఫెసర్ జీడీ యాదవ్ అవార్డుతో పాటు రూ. 1,11,111 నగదు బహుమతిని గెలుపొందారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేకానందను బుధవారం హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. బాబ్జి మాట్లాడుతూ డాక్టర్ కె. వివేకానంద రాష్ట్రంలోనే ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్‌గా రాష్ట్ర యువజన సర్వీసుల నుంచి అందుకున్నారన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో హెల్త్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. కోవిడ్ నిర్మూలనతో వైద్య విద్యార్థులను భాగస్వాములను చేయడంలో డాక్టర్ వివేకానంద పాత్ర మరువలేనిదన్నారు. మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులకు రోటరీ క్లబ్ సహకారంతో అనేక లక్షల మందికి ఉచితంగా సేవ చేసే కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు.