
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి భక్తులు హుండీల ద్వారా రూ.2.14 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. ఆది దంపతులకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. చైర్మన్ కర్నాటి రాంబాబు లెక్కింపును పర్యవేక్షించగా, 16 రోజులకు రూ.2,14,56,317 నగదు, 615 గ్రాముల బంగారం, 3.685 కిలోల వెండి లభించాయని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.2,62,108 విరాళాలను భక్తులు ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి సమర్పించారు.
వలంటీర్ల ఖాళీలు
భర్తీకి నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం కృష్ణా కలెక్టర్ పి. రంజిత్ బాషా విడుదల చేశారు. నోటిఫికేషన్ ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 209 ఖాళీలు ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్వీకరణ ముగిసిన అనంతరం ఎంపీడీవో, మునిసిపల్ కమిషనర్లు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారని కలెక్టర్ తెలిపారు.
కొనసాగుతున్న
జగన్మాత పుష్పార్చనలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బుధవారం పసుపు చామంతి, సంపెంగ పుష్పాలతో అర్చన జరిగింది. దుర్గగుడి చైర్మన్ రాంబాబు, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, పాలక మండలి సభ్యులు, దుర్గగుడి అధికారులు, సిబ్బంది అమ్మవారికి నిర్వహించే పుష్పాలతో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి పుష్పార్చనను శాస్త్రోక్తంగా జరిపించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పూజలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు విశేష పుష్పార్చన నిర్వహించిన పుష్పాలను ప్రసాదంగా పంపిణీ చేశారు. వసంత నవరాత్రోత్సవాలలో చివరి రోజైన గురువారం అమ్మవారికి కనకాంబరా లు, ఎర్ర గులాబీలతో అర్చన జరుగుతుంది.
ట్రాఫిక్‌పై కథనాలు అవాస్తవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో మంగళవారం ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. వార్తా కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. సాధారణంగా నగరంలో సాయంత్రం వేళల్లో కొన్ని ముఖ్యమైన కూడళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. మంగళవారం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఆఖరి పరీక్ష కావడం, తల్లిదండ్రులు తమ పిల్లలను సొంత ఊళ్లకు తీసుకెళ్లే క్రమంలో రద్దీ ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎప్పటిలాగానే భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ విషయంలో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కారణాల ఫలితంగా నగరంలో ట్రాఫిక్ కొంత నిదానంగా వెళ్లిందే తప్ప గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించలేదని స్పష్టం చేశారు.
