తాగునీటి సమస్య రానీయొద్దు

మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక చిత్రంలో వైస్‌ చైర్మన్లు, జెడ్పీ  సీఈవో  - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో బుధవారం ఉదయం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, అలాగే సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని స్టోరేజీ ట్యాంకులను ముందుగానే నింపుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

● గ్రామదర్శిని కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వటం లేదని, సమాచారం ఇస్తే స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఆస్కారం ఉంటుందని గన్నవరం, కంకిపాడు జెడ్పీటీసీ సభ్యులు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

● డ్వాక్రా సంఘాల రుణాల పేరుతో బుక్‌కీపర్లు, సీసీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

● అకాల వర్షాలకు నూజివీడు పరిసర ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం కలిగించాలని నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ గుదిమళ్ల కృష్ణంరాజు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

● ముసునూరు మండలంలోని నవోదయ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారం ఫీజును వసూలు చేస్తున్నారని అధికారులు నియంత్రించాలని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

● పునాదిపాడు, ఈడ్పుగల్లు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కంకిపాడు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. షాపులను సోదాలు చేసి విక్రయాలు జరపకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి.. కట్టడి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పరిషత్‌ పద్దు రూ. 175.88 కోట్లు..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 175.88 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తెలిపారు. స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నిర్ణీత ఫార్మాట్‌లో బడ్జెట్‌ అంచనాలు తయారుచేయటం జరిగిందన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ అంచనాగా రూ. 175.88 కోట్లు కాగా, ఆదాయపు అంచనా రూ. 1354.25 కోట్లు, ఖర్చు సవరణ అంచనాగా రూ. 1389.24 కోట్లు, మిగులు అంచనాగా రూ. 140.88 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ. 165.51 కోట్లు కాగా, ఆదాయపు సవరణ అంచనాగా రూ. 665.35 కోట్లు, ఖర్చు సవరణ అంచనా రూ. 654.98 కోట్లు, మిగులు అంచనాగా రూ. 175.88 కోట్లుగా బడ్జెట్‌లో చూపారు. ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈవో జి శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్‌ గరికపాటి శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

వేసవి ముదరకముందే ముందస్తు చర్యలు తీసుకోండి జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన చైర్‌పర్సన్‌

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top