
ఆలయంలో నిర్వహిస్తున్న హోమంలో ఆలయ కమిటీతో పాటు పాల్గొన్న ముస్లింలు
ఐక్యతకు వేదిక
సాక్షి కృష్ణా డెస్క్: హిందూ ముస్లిం భాయీ.. భాయీ.. అని చెప్పే స్లోగన్స్ వినిపిస్తాయే గానీ.. అంతగా కనిపించవు. కాని విజయవాడలోని ఓ ప్రాంతంలో దీనిని కళ్లారా చూడవచ్చు. అక్కడి వారికి కులం, మతం తేడా లేదు.. మీ దేవుడు, మా దేవుడు అన్న భేదం అంతకన్నా లేదు. అందరూ కలిసి రామాలయం నిర్మించుకున్నారు. ఏటా శ్రీరామనవమి నాడు హిందూ, ముస్లింలు కలిసి వేడుక చేసుకుంటున్నారు. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని సంబరాలకు ముస్తాబు చేశారు.
మత సామరస్యానికి ప్రతీక..
విజయవాడ చుట్టుగుంటలోని గులాం మొహియుద్దీన్ నగర్‌లోని హిందువులు, ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఇక్కడి హిందూ, ముస్లింలు కలిసి చుట్టుగుంటలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ దేవస్థానం శంకుస్థాపన, నిర్మాణంతో పాటుగా నిర్వహణలోనూ హిందువులతో పాటుగా ముస్లింలు కీలక పాత్ర పోషించారు. 1989లో చుట్టుగుంటలోని గులాం మొహియుద్దీన్‌నగర్‌లోని షేక్ బుడే, చెరుకూరి చంద్రమ్మలు ఈ ఆలయం నిర్మాణానికి విశేష కృషి చేశారు. నాటి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి గుడి నిర్మాణానికి స్థలం కేటాయించేలా చేశారు. 1990లో నాటి ఎమ్మెల్యే రత్నకుమారి, నగర మేయర్ జంధ్యాల శంకర్ చేతుల మీదుగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేయించారు. ఈ ప్రాంతంలో సుమారు 50 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఆలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఇక్కడ ఉన్న ముస్లింలలో ఎక్కువ మంది పాల్గొనడమే కాకుండా నవమి వేడుకల్లో భాగంగా ప్రసాదాలు తయారీకి ఉపయోగించే సరుకుల్లో కొంత భాగం వారు అందజేస్తారు. నవమి రోజు నిర్వహించే అన్నదానం కార్యక్రమంలో కూడా వారు స్వయంగా పాల్గొని సేవ చేస్తారు. దేవస్థానం కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటే వారిలో ఆరుగురు ముస్లింలే ఉన్నారు.
ఏళ్లుగా హిందూ, ముస్లింలు కలిసి పండుగ నిర్వహణ ఆలయ నిర్మాణంలోనూ ఇరు వర్గాల పాత్ర ఆదర్శంగా నిలుస్తున్న చుట్టుగుంట సీతారామచంద్రస్వామి ఆలయం
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా..
ఆలయ శంకుస్థాపన దగ్గర నుంచి 30వ తేదీ గురువారం నిర్వహించే శ్రీరామనవమి వేడుకల వరకు హిందూ, ముస్లింలు కలిసే నిర్వహిస్తున్నాం. ఆలయం తరఫున నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటారు. అయోధ్యలో రామాలయం నిర్మాణ వివాదం జరిగే సమయంలోనే ఈ ప్రాంతంలోని ముస్లింలు ఈ ఆలయానికి అవసరమైన ఇటుకలను మొత్తం ఉచితంగా అందజేశారు. కార్పొరేషన్ ఆలయానికి స్థలం కేటాయింపు చేసే ప్రక్రియలోనూ ముస్లింలు అండగా ఉన్నారు.
– డాక్టర్ చల్లా హరికుమార్,
ఆలయ కమిటీ చైర్మన్


చుట్టుగుంటలోని సీతారామచంద్ర స్వామి ఆలయం