
రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎల్‌పీవో సంపత్‌కుమారి, కమిటీ సభ్యులు
పెనమలూరు:పెనమలూరు గ్రామ పంచాయతీలో పూర్వ బిల్లు కలెక్టర్ షేక్.షంషుద్దీన్ నిధులు కాజేసిన ఘటన పై గుడివాడ డీఎల్‌పీవో సంపత్‌కుమారితో పాటు కమిటీ సభ్యులు బుధవారం రికార్డులు తనిఖీ చేశారు. షంషుద్దీన్ ఇంటి పన్నులు రూ.41,69,053, నీటి పన్నులు రూ.5,34,90 కలిపి మొత్తం రూ. 47,03,953 సొమ్ము స్వాహా చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీని పై కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టారు. బిల్లు పుస్తకాలు, డిమాండ్ రశీదులు, పన్నుల వసూళ్లు, ట్రెజరీకి జమ చేసిన సొమ్ము వివరాలు, నీటి పన్నులు, నీటి కుళాయి డిపాజిట్లు తదితర రికార్డులు పరిశీలించారు. కాగా అధికారుల తనిఖీలో ఇంటి పన్నులు, నీటి పన్నులు పూర్వ బిల్లు కలెక్టర్ ముగ్గురు కాంట్రాక్టు స్వీపర్లను పెట్టుకుని నిబంధనలకు విరుద్దంగా సొమ్ము వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పన్నులు స్వీపర్లు వసూలు చేస్తే ఇక్కడ పని చేసిన పంచాయతీ కార్యదర్శులు, గుమస్తాలు ఏమి చేశారనేది ప్రశ్నగా ఉంది. కాగా విచారణ విషయమై డీఎల్‌పీవో సంపత్‌కుమారిని వివరణ కోరగా ఇంకా విచారణ పూర్తి చేయలేదని, అన్ని విషయాలు తరువాత చెబుతామన్నారు. కాగా గోల్‌మాల్ అయిన రూ.47 లక్షలు రికవరీ చేస్తారా లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.