స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా ఫలితం శూన్యం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 61.57 శాతమే పన్నులు ఆసిఫాబాద్ బల్దియాదీ అదే తీరు..
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు పన్నుల వసూలులో లక్ష్యం చేరలేకపోయింది. అధికారులు వందశాతం పన్నులు చెల్లించిన వారికి బహుమతులు అందిస్తామని ఆఫర్లు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినా ఆశించిన స్థాయిలో వసూళ్లు కాలేదు. కాగజ్‌నగర్ బల్దియా పరిధిలో 30 వార్డులు ఉండగా 13,568 గృహాలు, 1096 వాణిజ్య గృహాలు, 567 పాక్షిక గృహాలు ఉన్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియగా పన్నుల లక్ష్యాన్ని చేరలేదు. పన్నుల సేకరణను వేగవంతం చేయడానికి అధికారులు ప్రత్యేక డ్రైవ్ సైతం నిర్వహించారు. మరోవైపు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కొత్తగా ఏర్పడిన బల్దియాలో పన్నుల వసూలు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.1.05 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.60 లక్షలు మాత్రమే వసూలైంది.
అంతంత మాత్రమే వసూలు
2025– 26 ఆర్థిక సంవత్సరంలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.380.47కోట్ల పన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే మార్చి 31 నాటికి రూ.234.26 కోట్లు మాత్రమే వసూలైంది. 61.57 శాతంగా నమోదైంది. రెసిడెన్షియల్ పన్నుల లక్ష్యం రూ.355.57 కోట్లు కాగా ఇందులో రూ.218.93 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నాన్ రెసిడెన్షియల్ విభాగంలో రూ.14.04 కోట్ల లక్ష్యానికి రూ.8.66 కోట్లు సేకరించారు. తాత్కాలిక రెసిడెన్షియల్ విభాగంలో రూ.10.83 కోట్ల లక్ష్యానికి రూ.6.67 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. పట్టణంలో 15 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా రూ.24.48 లక్షలు కట్టాలి. కానీ రూ.5.30 లక్షలు మాత్రమే వసూలు కాగా మరో రూ.19.18 పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 225 కార్యాలయాలు ఉండగా, రూ.13.30 లక్షలు చెల్లించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి మార్చి 31 వరకు ఒక పైసా వసూలు కాలేదు.
ఆఫర్లు ప్రకటించినా..
మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిల వసూలుకు అధికారులు బంపర్ ఆఫర్లను ప్రకటించారు. వందశాతం లక్ష్యం చేరుకోవాలనే లక్ష్యంతో పూర్తి బకాయిలు చెల్లించిన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బాక్సులో చీటీలు వేసి లక్కీడ్రా ద్వారా ఎన్నికై న వారికి మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతిగా రైస్‌కుక్కర్‌లు అందిస్తామని ప్రకటించారు. మరో వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. అయినా పన్ను చెల్లింపుదారులు ఆసక్తి చూపడంలేదు. నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపం వసూళ్లపై ప్రభావం చూపింది. బకాయిదారులు పన్నులు చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించకపోవడంతో లక్ష్యం చేరుకోవడం గగనంగా మారింది.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
మున్సిపాలిటీలోని ప్రజలు పన్నులు చెల్లించి అధికారులకు సహకరించాలి. పన్నుల వసూలుకు వార్డుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. పన్నుల వసూలుకు కాలనీల్లో అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతున్నాం.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్


