ఆసిఫాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఆటో, ట్రాలీ డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారులపై హెవీ లోడ్‌తో ప్రయాణించొద్దన్నారు. రాత్రిపూట రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, లైట్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, పట్టణ ఎస్సైలు కమలాకర్, చంద్రశేఖర్, సీనియర్ రెసిడెంట్ అప్తామాలజిస్ట్ పవన్, హౌజ్‌సర్జన్ అబ్బాస్ అలీ తదితరులు పాల్గొన్నారు.


