ఆసిఫాబాద్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఉదయం 9 గంటల నుంచి పంచాయతీ కార్యాలయాలు, అనుకూల ప్రదేశాల్లో సర్పంచ్, వార్డుల్లో కౌన్సిలర్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహిస్తారు. తొలుత ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపిస్తారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాల గురించి వివరిస్తారు. లబ్ధిదారుల జాబితా చదవడం, కొత్త పథకాలు, గ్రామ సమస్యలపై చర్చిస్తారు.
ఇంటింటికీ ఆహ్వాన లేఖలు
చింతలమానెపల్లి: గ్రామ సభకు హాజరుకావాలని కోరుతూ బుధవారం మండలంలోని డబ్బా గ్రామ సర్పంచ్ డోంగ్రి సంతోష్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. డబ్బా గ్రామంలోని ప్రజలు సభకు హాజరు కావాలని కోరుతూ కార్యదర్శి, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఆహ్వాన లేఖలు అందించారు. ఎక్కువ మంది ప్రజలు హాజరై గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో లేఖల ద్వారా ఆహ్వానించినట్లు సర్పంచ్ వెల్లడించారు.


