కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని భట్టుపల్లి చౌరస్తాకు తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేస్తూ మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతకు ముందు వార్డు నం.6, 7, పరిధిలో ఉన్న చౌరస్తాకు తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య చౌరస్తాకు పేరు పెట్టాలని కౌన్సిలర్ కావేటి విజయ్‌కుమార్ కోరారు. తీర్మానం అనంతరం ఆయన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ మలివిడత తెలంగాణ ఉద్యమంలో కావేటి సమ్మయ్య పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. నల్ల టీషర్టు ధరించి అసెంబ్లీ పైకెక్కి చేసిన నిరసన ఘటన రాష్ట్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిందని తెలిపారు. అలాంటి ఉద్యమకారుడికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించిందని పేర్కొన్నారు.


