శ్రీరాంపూర్: సింగరేణిలో సంవత్సరం కాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జీఎం ఎం.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డ వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. మెడికల్ ఫిట్ అయిన 300 మంది డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు గొర్ల సంతోష్, బుస్స రమేశ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


