ఆసిఫాబాద్: జనగణన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ గ్రామాలు, పంచాయతీ వార్డుల వారీగా బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని, ఒక్కో ఎన్యుమరేటర్‌కు 700 నుంచి 800 జనాభా వచ్చేలా చూడాలన్నారు. జాబితా రూపొందించి సీఎంఎస్ పోర్టల్‌లో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో జనగణన, ఇళ్ల గణన అధికారుల సమన్వయంతో చేపడతామని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ప్రారంభించామని, త్వరలో మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో అదననపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సీపీవో వాసుదేవరెడ్డి, ఉపగణాంక అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


