లక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇంటికి వెళ్లే క్రమంలో....
బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్ ముగ్గురూ కలిసి ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.


