పనులు నిలిపివేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

పనులు నిలిపివేయాలని వినతి

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

శ్రీరామనవమికి ముస్తాబైన జన్కాపూర్‌ కోదండ రామాలయం నేడు శ్రీసీతారాముల కల్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

వైభవోపేతం.. సీతారాముల కల్యాణం

కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు

పల్లకి మోస్తున్న మాలధారులు

అక్షింతలు వేస్తున్న భక్తులు

మంగళసూత్రం చూపిస్తున్న అర్చకుడు

కెరమెరి మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో గురువారం శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పల్లెర్ల మధుకర్‌, ప్రేమల ఇంటి నుంచి సీతమ్మ వారిని, కల్లూరి కృష్ణ, సాగరిక ఇంటి నుంచి రామయ్యను భాజాభజంత్రీల మధ్య మండపానికి తీసుకువచ్చారు. హనుమాన్‌ మాలధారులు పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. కులకర్ణి బాపూదేవ్‌ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ వివాహ మహోత్సవం జరిగింది. సీతారాముల ప్రతిమలకు పంచామృతంతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై నాయిన మధుకర్‌, ఎంపీడీవో సాయిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. – కెరమెరి

జానకీపురానికి కల్యాణ శోభ

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని జానకీపురం(జన్కాపూర్‌) సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. వారం రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భూమిని చదును చేసి, షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కల్యాణ ఘట్టాన్ని వినేందుకు వీలుగా జన్కాపూర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు ప్రధాన రహదారి పొడవునా మైక్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం నుంచి కోదండ రామాలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆనవాయితీలో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు దంపతులు సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. జిల్లాలో అధికార, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఆలయ చరిత్ర

ఒకప్పటి జనగామ, ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అప్పటి పట్టణ ప్రముఖులు స్వర్గీయ రాంచందర్‌రావు పైకాజీ 1970లో ఆలయాన్ని నిర్మించి సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుతుండటంతో భక్తుల తాకిడి పెరిగింది. పర్వదినాల్లో అన్నదానాలు, భజనలు, ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ్‌ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో రెండు దశాబ్దాల క్రితం భక్తుల సహకారంతో జన్కాపూర్‌ వాసులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపట్టారు. సీతారాముల విగ్రహాలతో పాటు శివలింగం, షిర్డీ సాయినాథుడి విగ్రహాలు, ఈశాన్యంలో నవగ్రహాలు ప్రతిష్టించారు. దాతల సహకారంతో కల్యాణ మండపం కూడా నిర్మించారు.

మధ్యాహ్నం 12.03 గంటలకు ముహూర్తం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శుక్రవారం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4.30 గంటలకు సీతారాములకు అభిషేకం, 7 గంటలకు కేశవనాథ ఆలయంలో ఉత్సవ మూర్తుల ప్రోక్షణ, పుణ్యాహవచనం, 8 గంటలకు వధూవరులకు మధుపర్కాలు, బాసింగాలతో అలంకరణ, 9 గంటలకు ఆసిఫాబాద్‌ నుంచి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలతో హనుమాన్‌ దీక్షాస్వాముల శోభాయాత్ర చేపడతారు. 11 గంటలకు కల్యాణ ఘట్టం ప్రారంభమతుంది. 11.30 గంటలకు కన్యాదానం, మధ్యాహ్నం 12.03 గంటలకు సీతారాముల కల్యాణ ముహూర్తం నిర్ణయించారు. అనంతరం మహాప్రసాదం(అన్నదానం), సాయంత్రం 6 గంటలకు పల్లకిసేవ, రాత్రి 8 గంటలకు విష్ణుసహస్రనామ పారాయణం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వద్ద బెల్లం పానకం, మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేయనున్నారు. పట్టణానికి చెందిన అర్చకుడు నిమ్మకంటి సంతోష్‌శర్మ అన్నదాన కార్యక్రమానికి ఆర్థికసాయం అందించారు.

28న జాతీయ లోక్‌అదాలత్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఈ నెల 28న జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ గురువారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాము, కార్తీకేయ ఉత్తమ ప్రతిభ చూపారని అన్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.

క్రీడల్లో రాణించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఎస్‌వో షేకు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో గురువారం అస్మిత కబడ్డీ లీగ్‌ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మహిళా డిగ్రీ కళాశాల మొదటి స్థానం, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, పీడీలు, పీఈటీలు రాకేశ్‌, శారద, కోచ్‌లు విద్యాసాగర్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: పాత తీర్మానాల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులను వెంటనే నిలిపివేయాలని గురువారం పట్టణంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీలో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నిధుల కొరతతో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో బల్దియా ఉందన్నారు. కార్మికుల పొట్టకొట్టి తీర్మానాల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు చేయడం దుర్మార్గమని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టర్‌, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వలీ, శ్రీధర్‌(రాము), మాణిక్యం, పోచం, వసీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement