విత్తన వరి.. లాభాల సిరి | - | Sakshi
Sakshi News home page

విత్తన వరి.. లాభాల సిరి

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

● జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు ● ఏటా పెరుగుతున్న విస్తీర్ణం ● ఎకరానికి రూ.60వేల పైనే ఆదాయం ● ఆసక్తి చూపుతున్న అన్నదాతలు

పెంచికల్‌పేట్‌: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటల సాగుతో నష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్లుగా అన్నదాతలు వరిధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విత్తన వరి సాగుపై దృష్టి సారించారు. ఆయా విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. పంట పొలాలను సందర్శించి విత్తనాలు, మందులు అందిస్తున్నారు. దీంతో జిల్లాలో విత్తన సాగు గణనీయంగా పెరిగింది.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం

ఆసిఫాబాద్‌, రెబ్బెన, సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌ మండలాల్లో మాత్రమే రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేస్తున్నారు. సుమారు పదేళ్ల క్రితం దహెగాం మండలానికి చెందిన రైతులు విత్తన వరి పండించడం ప్రారంభించారు. క్రమేణా దహెగాం నుంచి పెంచికల్‌పేట్‌, రెబ్బెన మండలాలకు విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచికల్‌పేట్‌ మండలానికి చెందిన రైతులు ఈ విత్తన వరి సాగు వైపు మళ్లారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో విత్తన వరి సాగు చేస్తున్నారు. అయితే సాధారణ రకాలతో పోల్చితే విత్తన వరి సాగు కష్టంగా ఉంటుంది. నారు పోసిన నాటి నుంచి పంట చేతికందే వరకు రైతులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కలుపు నియంత్రణ, ఎరువులు చల్లడం, పురుగు మందుల పిచికారీ, పూత సమయంలో కూలీలపై ఆధారపడాల్సిందే. పూత వచ్చే సమయంలో రెండెకరాలకు నలుగురు కూలీలు 20 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తారు. క్రమం తప్పకుండా పురుగు మందుల పిచికారీతోనూ పెట్టుబడులు అధికంగా ఉంటాయి.

రూ.60 నుంచి రూ.80వేల ఆదాయం

హైబ్రీడ్‌ వరి సాగులో ఎలాంటి అనుభవాలు లేని రైతులకు కంపెనీల ప్రతినిధులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. నిరంతరం పొలాలను సందర్శించి సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. పంటను ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తున్నాయి. విత్తన రకాన్ని బట్టి క్వింటాల్‌కు రూ.9వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తారు. పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement