పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం
రెండో విడతలో భారీగా పోలింగ్‌శాతం పలు పంచాయతీల్లో 90శాతానికి పైగా నమోదు
దహెగాం(సిర్పూర్): జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం పోటెత్తి ఓటువేశారు. దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లో భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. 1,31,278 మంది ఓటర్లకు 1,13,733 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 86.64 శాతం పోలింగ్ నమోదైంది. అ ధికారులు విస్తృతంగా అవగాహన క ల్పించడంతో పలు పంచాయతీల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
కేంద్రాలకు క్యూకట్టి..
మొదటి విడత ఎన్నికలు జరిగిన గిరిజన పల్లెల్లో చలి ప్రభావంతో ఉదయం మందకొడిగా సాగింది. అయితే రెండో విడతకు మాత్రం ఉదయం నుంచే పలు కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక ఉదయం 9గంటల తర్వాత నుంచి భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించ డం కూడా పోలింగ్‌కు పెరిగేందుకు కారణమైంది. అయితే పెరిగిన ఓటింగ్‌శాతం కొందరికి మేలు చేయగా, మరికొందరికి మాత్రం చేటు చేసింది.
అత్యధికం దహెగాం.. అత్యల్పం బెజ్జూర్
మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా దహెగాంలో 90.44 శాతం పోలింగ్ నమోదైంది. పెంచికల్‌పేట్ 90.26 శాతం ఉండగా, అత్యల్పంగా బెజ్జూర్‌లో 83.70 శాతం నమోదైంది.


