మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్‌అర్బన్: మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మూడో విడత ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఫేజ్–2 ఆర్‌వోలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని, మొదట మారుమూల పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ వేగవంతంగా జరిగేలా చూడాలని, ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


