‘నిద్దుర’లో నిఘా..!
మూడో కంటికి మరమ్మతులు కరువు జిల్లాలో పని చేయని సీసీ కెమెరాలు నేర పరిశోధనలో పెరిగిన నిఘా నేత్రాల ప్రాధాన్యత జిల్లాలో తరుచూ దొంగతనాలు
కౌటాల మండల కేంద్రంలో గతంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన బైక్‌లను తరుచూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే అవి నిరుపయోగంగా ఉండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఇటీవల కౌటాలలో మూడు బైక్‌లను పార్కింగ్ ప్రదేశం నుంచి దుండగులు అపహరించారు.
కౌటాల: జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా మా రాయి. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతాలు జిల్లాకు సరిహద్దుగా ఉండటం, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులువుగా తప్పించుకునే అవకాశాలు ఉండటంతో దొంగలు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, ముఖ్య ప్రాంతా లు, రద్దీ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉన్నా నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో నిఘా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరమ్మతులకు నిధులు లేకపోవడం వల్ల కెమెరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకోలేకపోవడంతో వీరి ఆగడాలకు అంతం లేకుండా పోతుంది.
ఏటా దొంగతనాలు..
మండల కేంద్రాలు, పట్టణాల్లోని ఆయా కూడళ్లలో బిగించిన సీసీ కెమెరాలు ఆయా పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానించి ఉంటాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసినవి నాణ్యతగా చిత్రీకరిస్తాయి. చలాన్లు విధించే ప్రదేశంలో అధికారులు వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాలో దాదాపు 5 వేల వరకు వాణిజ్య సముదాయాలు, ౖప్రైవేట్ వ్యక్తుల సాయంతో కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాణ్యతతో కూడిన వాటిని బిగించకపోవడంతో తక్కువ కాలంలోనే మరమ్మతులకు గురవుతున్నాయి. అభివృద్ధి పనులు, భారీ వర్షాలు, కోతుల బెడదతో నిఘా నేత్రాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వైర్లు తెగిపోయి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో మరమ్మతులతో పాటు నిర్వహణ భారంగా మారింది. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి వేళ పెట్రోలింగ్ చాలా వరకు తగ్గింది. దీంతో దొంగలు దండయాత్ర చేస్తున్నారు. జిల్లాలో ఏటా వందకు పైగా చోరీ కేసులు నమోదు అవుతున్నాయి.
కేసుల్లో కీలకం..
పోలీసు కేసుల పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. గతంలో నేరం జరిగినప్పుటి నుంచి కేసును పరిష్కరించడానికి పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేక కోణాల్లో విచారణ చేపట్టేవారు. అయితే సీసీ కెమెరాలు వచ్చాక వారి పని చాలా సులువైంది. క్లిష్టమైన కేసులను సులువుగా ఛేదిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు లేక పోలీస్ శాఖకు తలనొప్పిగా మారింది.
జాడలేని పర్యవేక్షణ..
కమ్యూనిటీ పోలీసింగ్ కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా.. వాటి పర్యవేక్షణపై శ్రద్ధ కనబర్చడం లేదు. నేరం జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేస్తుంటే ఆ నిఘా నేత్రం పని చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన పోలీసులకు కొన్ని సందర్భాల్లో నిందితులను పట్టుకోవడం కష్టమవుతోంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి వినియోగంలోకి తేవడంతో పాటు ఠాణాకు అనుసంధానిస్తే బాగుంటుంది. పట్టణాలు, మండల కేంద్రాలు జరుగుతున్న ఘటనలను పోలీసులు ఠాణా నుంచే పర్యవేక్షించడంతో పాటు నియంత్రించే అవకాశం ఉంది. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.


