తుపాను.. దడ! | - | Sakshi
Sakshi News home page

తుపాను.. దడ!

Oct 29 2025 8:27 AM | Updated on Oct 29 2025 8:27 AM

తుపాన

తుపాను.. దడ!

● ‘మోంథా’ ప్రభావంతో జిల్లాలో వర్షం ● పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం ● జిల్లాకు అరెంజ్‌ అలర్ట్‌.. నేడు వర్ష సూచన ● కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో ఆందోళన

కౌటాల మండలం యాపలగూడకు చెందిన రాంటెంకి శ్రీకాంత్‌ మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఎర్ర రేగడి నేల కావడంతో త్వరగానే పత్తితీతకు వచ్చింది. కానీ మోంథా తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో పత్తి తడిసి నేలరాలింది. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికందే సమయంలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కౌటాల(సిర్పూర్‌): మోంథా తుపాను ప్రభావం జిల్లాపై పడింది. సోమవారం రాత్రి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారమంతా ఆకాశం మబ్బులు పట్టి ఉంది. మరో రెండు రోజులపాటు మోస్తరు వానలు పడే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాత ఆగమాగం..

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.40 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి, 60వేల ఎకరాల్లో వరి పంట, ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం రైతులు పత్తి ఏరడంతోపాటు వరికోతలు ప్రారంభించారు. మొక్కజొన్న నూర్పిడి చేసి మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా కౌటాల మండలంలో పత్తి తడిసి నల్లబడుతుండగా, దహెగాం, పెంచికల్‌పేట్‌ మండలాల్లో వరి నేలకొరిగింది. కొందరు రైతులు మబ్బుల కారణంగా వరికోతలు వాయిదా వేసుకున్నారు.

ప్రారంభం కాని కొనుగోళ్లు

ఓ వైపు పత్తి చేతికందుతుండగా.. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభం కాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. జిల్లాలో 18 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా ఏడు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సీసీఐ కేంద్రాల్లో 12శాతం తేమతో క్వింటాల్‌కు రూ.8,110 మద్ద తు ధర అందుతుంది. సాధారణంగా రైతులు సీజన్‌ ప్రారంభంలో పంటల సాగు కోసం వ్యాపారుల కొంత మొత్తం నగదును పెట్టుబడి కోసం అప్పుగా తీసుకుంటారు. కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అప్పులు తీర్చేందుకు తక్కువ ధర కు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. కొందరు వ్యాపారులు తేమ పేరుతో రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. అకాల వర్షాలకు తేమ ఉందని, రంగు మారిందని సాకులు చెబుతున్నారు. క్వింటాల్‌కు రెండు, మూడు కిలోల తరుగు తీస్తున్నారు.

సోమవారం నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో)

ప్రాంతం వర్షపాతం

కౌటాల 21.0

సిర్పూర్‌(టి) 13.1

రెబ్బెన 10.4

కాగజ్‌నగర్‌ 9.7

ఆసిఫాబాద్‌ 9.2

దహెగాం 8.9

తిర్యాణి 7.9

పెంచికల్‌పేట్‌ 7.7

చింతలమానెపల్లి 6.8

బెజ్జూర్‌ 6.7

నవంబర్‌లో ప్రారంభిస్తాం

నవంబర్‌ మొదటి వారంలో జిల్లాలో సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులందరూ కపాస్‌ కిసాన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. పంట అమ్మిన వెంటనే ఖాతాల్లో నగదు జమ చేస్తాం.

– అశ్వక్‌ అహ్మద్‌, ఏడీ మార్కెటింగ్‌ శాఖ

తక్కువకే అమ్ముకుంటున్నాం

రెండెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నాం. అకాల వర్షాలకు తడిసిన పత్తిని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అధికారులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర కల్పించాలి.

– వసంత్‌రావ్‌, ముత్తంపేట్‌, కౌటాల

తుపాను.. దడ!1
1/3

తుపాను.. దడ!

తుపాను.. దడ!2
2/3

తుపాను.. దడ!

తుపాను.. దడ!3
3/3

తుపాను.. దడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement