రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
ఆసిఫాబాద్‌అర్బన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్లు దేవయ్య, విశ్వనాథ్‌తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, ప్రాథమిక సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రాల్లో రైతుల కోసం తాగునీరు, నీడ, టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయాధికారులు పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ కౌటాల, దహెగాంలో అదనపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏవో వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలి
ఆకాంక్షిత బ్లాక్‌లో భాగంగా తిర్యాణి మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి తిర్యాణి మండలంలో చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతా రం, డీటీడబ్ల్యూవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త అబిద్ అలీ, తిర్యాణి ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


