తొలగిన అనిశ్చితి
కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: సిర్పూర్ పే పర్ మిల్లు కార్మిక గుర్తింపు ఎన్నికల విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగింది. ఆదిలాబాద్‌లో మంగళవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 15 గుర్తింపు కార్మిక సంఘాలు హాజరు కావాల్సి ఉండగా, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ జాతీయ సంఘాలతోపాటు మరో ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్పీఎం ప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫోన్‌లో ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తుది ఓటరు జాబితాను అందించాలని సూచించారు. నవంబర్ 3లోగా జాబితా అందిస్తామని ఎస్పీఎం యాజమాన్యం హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల నాయకులు వె ల్లడించారు. కొన్నేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడంతో కార్మికులు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు మోక్షం
మిల్లు పునఃప్రారంభం నుంచి ఏడేళ్లుగా ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. పలుమార్లు సంఘాల నాయకులు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్) రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో స్పష్టత వచ్చింది. కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎన్నికల పక్రియను వేగవంతం చేస్తామని రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది.
హాజరుకాని ఎస్పీఎం ప్రతినిధులు
ఆదిలాబాద్‌లో జరిగిన సమావేశానికి ఎస్పీఎం తరుఫున ప్రతినిధులు హాజరు కాలేదు. గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేకనే హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో పలువురు కార్మిక సంఘం నాయకులు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రతినిధులను ఫోన్‌లో సంప్రదించాలని పట్టుబట్టారు. చివరికి ఫోన్‌లోకి అందుబాటులోకి వచ్చిన ప్రతినిధులు తుదిజాబితా అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.


