శ్రావణిది కుల దురహంకార హత్యే
దహెగాం(సిర్పూర్): నిండు గర్భిణి తలాండి శ్రావణిది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి అన్నారు. మండలంలోని గెర్రె గ్రామంలో మంగళవారం శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులం పేరుతో హత్యకు పాల్ప డడం సిగ్గు చేటన్నారు. గర్భిణిని హత్య చేసిన ఆమె మామ శివార్ల సత్తయ్యతోపాటు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ పరిహారం అందించాలని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీపీఎం, టీఏజీఎస్, డీవైఎఫ్‌ఐ, ఏఐఏడబ్ల్యూయూ, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, నాయకులు నేర్పెల్లి అశోక్, కార్తీక్ తదితరులు ఉన్నారు.


