శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దహెగాం మండలం గెర్రె గ్రామంలో హత్యకు గురైన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ శ్రావణితోపాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయినందున రెండు హత్యలకు సంబంధించిన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి కుటుంబ సభ్యుల పేర్లు పొందుపర్చి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మాలశ్రీ, అశోక్, శ్రీనివాస్, ఆనంద్, దుర్గం దినకర్, టీకానంద్, కార్తీక్, పురుషోత్తం, నిఖిల్, శ్రీకాంత్, సాయి, సాయికృష్ణ, వినోద, అనిత, కమల, లక్ష్మి, గెర్రె, చిన్న రాస్పల్లి, ఒడ్డుగూడ తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


