శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
కాగజ్‌నగర్‌టౌన్: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 55 బైక్‌లను సీజ్ చేశారు. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వ్యాపారులు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. కాగజ్‌నగర్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు శ్రీకాంత్, లక్ష్మణ్, కల్యాణ్, పోలీసులు పాల్గొన్నారు.


