ఎవరికో లక్కు..!
నేడు లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి 32 షాపులకు 680 దరఖాస్తులు దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: మద్యం దుకా ణాల కేటాయింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం ఆశించిన విధంగా వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2026– 27 సంవత్సరానికి జిల్లాలోని 32 మద్యం దుకాణాలు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రారంభంలో వ్యాపారుల నుంచి స్పందన అంతంతే ఉండటం, రాష్ట్రంలో బీసీ బంద్ నిర్వహించడంతో గడువు పొడిగించారు. ఈ నెల 23 వరకు గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య సైతం పెరిగింది. 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రభుత్వం 32 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 1,020 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల చొప్పున రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 32 దుకాణాలకు 680 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే 340 దరఖాస్తులు తక్కువగా వచ్చినా.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు ఉండటంతో ఆదాయం రూ.20.40కోట్లు వచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెంచడంతో దరఖాస్తులు తగ్గినా ఆదాయం అంతే మొత్తం సమకూరింది.
ఉదయం 10 గంటలకు ప్రారంభం
గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా లక్కీడ్రా విధానంలో దరఖాస్తుదారులకు మద్యం షాపులు కేటాయించనున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి వైన్స్‌ల కేటాయింపు ప్రారంభం కానుంది. తాగునీరు, జనరేటర్, మైక్ సెట్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. ఎకై ్సజ్ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం సీరియల్ నంబర్ 01 నుంచి లక్కీడ్రా ప్రారంభిస్తారు. షాపు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభించుకోవచ్చు. లైసెన్స్ ఫీజులో ఆరో వంతు మొదటి విడతగా 28లోగా చెల్లించాలి.
25 వైన్స్‌లకే లక్కీడ్రా
జిల్లాలోని మద్యం దుకాణాలకు అత్యధిక దరఖాస్తులు రాగా.. మరికొన్ని షాపులకు మద్యం సింగిల్ డిజిట్ దాటలేదు. జిల్లాలోనే అత్యధికంగా గూడెం వైన్స్‌కు 67 దరఖాస్తులు రాగా, రెబ్బెన మండలం గోలేటిలోని వైన్స్‌కు మూడు మాత్రమే వచ్చాయి. జైనూర్(30) దుకాణానికి ఏడు దరఖాస్తులు రాగా, జైనూర్(31) 8, సిర్పూర్(యూ)(32 ) 9, గోలేటి(10 ) 3, కాగజ్‌నగర్(14) 7, రెబ్బెన(09) 6, రవీంద్రనగర్(22) షాపునకు 5 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడు దుకాణాలకు లక్కీడ్రా నిలిపివేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ తెలిపారు. సోమవారం 25 దుకాణాలకు మాత్రమే లక్కీడ్రా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.


