అన్నదాతకు ఆపద
కౌటాల(సిర్పూర్): రైతాంగాన్ని ప్రకృతి పగబట్టింది. పత్తితోపాటు వరి, సోయా, మొక్కజొన్న పంట లు అకాల వర్షానికి తడిసి దెబ్బతింటున్నాయి. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. పత్తి పంట చేలలోనే తడిసి ముద్దవుతుండగా, వరి పంట నేలవాలుతోంది. కోతలు పూర్తయిన సోయాను ఆరబెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తెగుళ్ల, యూరియా కొరత నేపథ్యంలో దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం అకాల వర్షాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తడిసిన పంటలు..
జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానమైన పత్తిని ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. శనివారం పెంచికల్‌పేట్ మండలంలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దహెగాంలో 13.3 మి.మీ. లు, చింతలమానెపల్లిలో 10.2, లింగాపూర్‌లో 7.7, తిర్యాణిలో 5.2, సిర్పూర్(టి)లో 5.1 మి.మీ.ల వర్షం కురిసింది. కూలీల కొరత ఉండటంతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంతో పత్తితీత పనులు జోరందుకోలేదు. పంట మొ త్తం చేలలోనే ఉంది. శుక్రవారం సాయంత్రం, శని వారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పంట తడిసి నేలరాలుతోంది. మబ్బులతో నల్లబారే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొంచి ఉన్న వాన ముప్పు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీంతో ఆకాశం మబ్బులు పట్టి ఉంటోంది. మరో రెండు, మూడు రోజుల పా టు ఇదే స్థితి కొనసాగవచ్చు. పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పత్తి దెబ్బతినడంతోపాటు పొట్ట దశలో ఉన్న వరి గింజలు నాపగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట తడిసింది
మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాను. మొదటి సారి పంట తీయడానికి సిద్ధమవుతుండగా అకాల వర్షం కురిసింది. పంటంతా చేనులోనే తడిసి ముద్దయింది. కొంతవరకు నేలరాలగా, చెట్లపై ఉన్నది నల్లగా మారుతోంది. న ల్లగా మారితే కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రారు. అధికారులు ఇప్పటికై నా సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి.
– శంకర్, రైతు, యాపలగూడ
అన్నదాతకు ఆపద


