మన్‌కీ బాత్‌లో భీం ప్రస్తావన
ఆసిఫాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆది వారం నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పోరాట వీరుడు కుమురంభీం గురించి ప్రస్తావించారు. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ రాజ్యంలో నిజాంకు వ్యతిరేకంగా ఆదివాసీ అయిన కుమురం భీం పోరాడినట్లు వివరించారు. పన్నుల వసూళ్ల కోసం నిజాం నియమించిన అధికారి సిద్దిఖీ ఆదివాసీ మహిళలపై దాడుల కు పాల్పడ్డాడని, ప్రజల నుంచి భూములు లాక్కున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి అకృత్యాలను సహించని కుమురంభీం అతడిని హతమార్చారన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వందల కిలోమీటర్ల దూరంలోని అస్సాంలో వెళ్లిపోయారని తెలిపారు. ఈ నెల 22 కుమురంభీం జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 ఏళ్ల జీవితకాలంలోనే ఆదివాసీల కోసం ఎన్నో పోరాటాలు సాగించారని వివరించారు. కుమురంభీం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పీఎం తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. అలాగే భగవాన్ బీర్సా ముండా కూడా ఆదివాసీల కోసం పోరాటాలు చేశారని కొనియాడారు. ఇలాంటి వ్యక్తుల చరిత్ర గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.


