వెడ్మ రాము పోరాటం మరువలేనిది
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆదివాసీల హక్కుల సాధన కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో కుమురం భీంతో కలిసి వెడ్మ రాము చేసిన పోరాటం మరువలేనిదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తిర్యాణి మండలం ఎదులపహాడ్ గ్రామంలో ఆదివారం వెడ్మ రాము 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఎదులపహాడ్ గ్రామంలో రాము విగ్రహంతోపాటు స్మృతివనం ఏర్పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వెడ్మ రాముకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీటీడీవో రమాదేవి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం సంతోష్, మాజీ జెడ్పీటీసీలు చంద్రశేఖర్, వెడ్మ కమల, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అనిల్‌గౌడ్, హన్మండ్ల జగదీశ్, ఆత్రం భీంరావు, మర్సుకోల తిరుపతి, తొడసం శ్రీనివాస్, చహకటి దశ్రు తదితరులు పాల్గొన్నారు.


