ఆశవర్కర్లకు రూ.25వేల వేతనం చెల్లించాలి
కాగజ్‌నగర్‌టౌన్: ఆశవర్కర్లకు కనీస వేతనంగా నెలకు రూ.25వేలు చెల్లించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో శనివారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లాస్థాయి మూడో మహాసభలు నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల సేవలను డబ్ల్యూహెచ్‌వో, ఇతర అంతర్జాతీయ సంస్థలు గుర్తించినా కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రూ.50లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు జీవో విడుదల చేయలేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంత్యక్రియల ఖర్చు, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు స్వరూప, వివిధ మండలాల ప్రతినిధులు రజిని, పద్మ, రమ, నవీన, ఓమల, సునీత, శోభ, శకుంతల తదితరులు పాల్గొన్నారు.


