
గుడుంబా నిర్మూలనకు కదిలిన యువత
దహెగాం(సిర్పూర్): గుడుంబా నిర్మూలనకు దహెగాం మండలం కర్జి గ్రామ యువత నడుం బిగించారు. బుధవారం యువకులు ఇంటింటికీ వెళ్లి గుడుంబా తాగడంతో కలిగే దుష్ప్రభావాలను వివరించారు. గ్రామంలో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం అందించి కేసులు నమోదు చేయిస్తామని విక్రయదారులను హెచ్చరించారు. అనంతరం గ్రామంలో గు డుంబాను పూర్తి నిర్మూలించాలని స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. యువకులు మాట్లాడుతూ గుడుంబాను తాగడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కోలుకోవడం లేదన్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు మానుకోవాలని వారు హెచ్చరించారు.