హక్కుల కోసం పోరాడిన వీరులు
ఆసిఫాబాద్‌రూరల్: హక్కుల కోసం ఆదివాసీ వీరు లు కుమురంభీం, ఎడ్ల కొండు అలుపెరగని పోరా టం చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కుమురంభీం స్వస్థలం ఆసిఫాబాద్ మండలం పాత రౌట సంకెపల్లిలో బుధవారం భీం జయంతి, అతని సహచరుడు ఎడ్ల కొండు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. డీటీడీవో రమాదేవి, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఆదివాసీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధన కోసం కుమురంభీం ప్రాణాలను త్యాగం చేశారన్నారు. గిరిజన వీరులను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. భీం పుట్టిన గ్రామం రౌటసంకెపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డీటీడీవో మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, ఆదివాసీ నాయకులు అర్జు, కోవ విజయ్, వెంకటేశ్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఎడ్ల కొండు వారసులు బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.


