
కొనుగోళ్లకు సమాయత్తం!
జిల్లావ్యాప్తంగా 56 వేల ఎకరాల్లో వరి సాగు త్వరలో 40 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 44,532 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
దహెగాం(సిర్పూర్): వానాకాలం సీజన్ సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ నెలాఖరులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్రాల ప్రారంభానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వివిధ మండలాల్లో మరో పది, ఇరవై రోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యంలో 18, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కేంద్రాలను ప్రారంభిస్తారు. మొదటి రకం ధాన్యానికి రూ.2,389, రెండో రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించనున్నారు. గతేడాది మాదిరిగానే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 నగదు బోనస్‌గా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తగ్గిన సేకరణ లక్ష్యం
జిల్లాలోని రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్, వాంకిడి, దహెగాం, పెంచికల్‌పేట్, బెజ్జూర్, కౌటాల, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల్లో 56 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో ఈ ఏడాది నాట్లు ఆలస్యమయ్యాయి. అలాగే గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. పొట్ట దశ లో ఉన్న పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ఈ వానాకాలం సీజన్‌లో 44,532 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతేడాది 57 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నా.. కేవలం 10,695 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. దీంతో ఈ ఏడాది లక్ష్యం తగ్గించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో కఠిన నిబంధనల నేపథ్యంలో రైతులు ఎక్కువగా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. గతేడాది ప్రైవేట్ వ్యాపారులకు వరిధాన్యం అమ్ముకున్నారు.
జమకాని బోనస్
యాసంగి సీజన్‌లో సాగుచేసిన వరి సన్నరకం ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ కాలేదు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. బోనస్‌కు 12,090 మంది రైతులు అర్హులు కాగా, వారికి రూ.2.80 కోట్ల నగదు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.