భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి

Oct 5 2025 2:14 AM | Updated on Oct 5 2025 2:14 AM

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌: కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న కుమురంభీం వర్ధంతికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో భీం వర్ధంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాగునీరు, విద్యుత్‌, రవాణా, భోజన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రజల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల ని తెలిపారు. ఆర్టీసీ అధికారులు జోడేఘాట్‌కు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు మరమ్మతు చేయాలని, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి వర్ధంతిని విజయవంతం చేయాలని సూ చించారు. డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఒమర్‌ హుస్సేన్‌, ఇంజినీరింగ్‌, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలు నిబంధనలకు లోబడి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ గదులను ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 9నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్‌ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ గదుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్‌, జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

7న విద్యాసంస్థలకు సెలవు

ఆసిఫాబాద్‌రూరల్‌: కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ నెల 7న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జోడేఘాట్‌లో కుమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 7కు బదులు నవంబర్‌ 8న రెండో శనవారాన్ని పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement