
దసరా జోష్
ఆసిఫాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలో వ్యాపారాలు జోరుగా సాగాయి. వివిధ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడాయి. పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. కిరా ణా, పండ్లు, పూలు, మాంసం దుకాణాలు కొనుగో లుదారులతో రద్దీగా కనిపించాయి. బంగారు ఆభరణాల దుకాణాలు సందడిగా మారాయి. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి రోజూవారీ ఆదాయం పెరిగింది.
జోరుగా మద్యం అమ్మకాలు
దసరా సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత నెల 28నుంచి ఈ నెల ఒకటి వరకు జిల్లాలోని 32మద్యం దుకాణాల్లో రూ.5.47 కోట్ల విలువైన 7.098 ఐఎంఎల్ కేసులు, 3,203 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. డిమాండ్‌ను ఊహించిన వైన్స్ యజమానులు ముందుగానే సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచారు.
వ్యాపారులకు లాభాలు
ప్రధానంగా మద్యం, మాంసం విక్రయాలతో పా టు షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ దుకాణాలు ఇతర వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. బతుకమ్మ సందర్భంగా పండ్లు, పూల వ్యాపారాలు జోరుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 100కు పైగా మాంసం దుకాణాల్లో సుమారు రూ.కోటికి పైగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బిజినెస్ బాగా జరిగి వ్యాపారులకు లాభాలు వచ్చాయి.
ఆర్టీసీకి సమకూరిన ఆదాయం
దసరా సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాకు చెందిన వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు తరలివచ్చారు. వ్యాపారులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 25నుంచి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు వేశారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు ప్రయాణికుల తాకిడి పెరి గింది. సాధారణంగా ఆసిఫాబాద్ డిపోకు నిత్యం సగటున రూ.16 లక్షల ఆదాయం సమకూరుతుండగా, దసరా సందర్భంగా అదనపు ఆదాయం వచ్చింది. గత నెల 26నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు రూ.1.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.