
కోల్ ఇండియా స్థాయిలో పతకాలు సాధించాలి
రెబ్బెన: సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి నరేందర్ అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 92వ వార్షిక క్రీడల్లో భాగంగా ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో డిపార్ట్‌మెంటల్ టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీవో నరేందర్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటమలు సహజమన్నారు. ప్రతీ క్రీడాకారుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ పోటీల్లో రాణించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సింగరేణి క్రీడాకారులు కోల్‌ఇండియా పోటీల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి పతకాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్‌అండ్‌జీఏ వైస్ ప్రెసిడెంట్ రామజల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహరా, ఎస్టేట్స్ అధికారి సాగర్, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, చీఫ్ కోర్డినేటర్ శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోఆర్డినేటర్ అన్వేష్, జనరల్ కెప్టెన్ కిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.