
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్‌అర్బన్: విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ ఉద్యోగుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని అట వీశాఖ కార్యాలయంలో అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏటా అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో షేక్ హైదర్, గౌస్ మొహినొద్దీన్, కొండల్‌రావు, శ్రీహరి అనే అటవీ అధికారులు వివిధ ఘటనల్లో మృతి చెందారని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలో దాదాపు 32 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, రేంజ్ అధికారి ఝాన్సీ రాణి, ఏవో వెంకటకృష్ణ, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.